పి. సుశీల మధురగీతాలు | P. Susheela Madhura Gitalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పి. సుశీల సుమధురగీతాలు 
 P. Susheela Madhura Gitalu 
Rs 108/-

-----------------------
మన జాతి సంపద!


     నలభయ్యేళ్ళపాటు దక్షిణ భారత దేశాన్ని తన పాటతో ఉర్రూతలూపిన సుశీల గారు సినీ నేపథ్య రంగాన్ని ఒక విధంగా ఏలారని చెప్పవచ్చు. ఆమె సినీ రంగంలోకి వచ్చేటప్పటికి అగ్ర గాయనీమణులుగా వెలుగొందుతున్న పి.లీల, జిక్కీలు ఆ ప్రభంజనానికి వెనక్కు తగ్గక తప్పలేదు. సుశీలగారి తరువాత అయిదేళ్ళకు సినీ రంగంలోకి వచ్చిన ఎస్‌.జానకి గారు కూడా 1970ల ద్వితీయార్ధంలో కానీ అగ్ర గాయనిగా కుదురుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో సుశీల గారి హవా అంతగా నడిచింది.

   సుశీలగారిది తియ్యటి గొంతు. ప్రయత్నించి, సాధన చేస్తే వచ్చే గొంతు కాదది. భగవత్‌ ప్రసాదం. ఏది పాడినా తీయగా ఉంటుంది. ఆ గొంతు పలకని సంగతి లేదు. ప్రణయ గీతాలైనా, విరహ గీతాలైనా, విషాద గీతాలైనా, వీణ పాటలైనా, జానపదాలైనా, జయదేవుడి అష్టపదులైనా... ఏదైనా... ఎటువంటిదైనా సుశీలగారు పాడితే కొత్త అందం వచ్చి తీరాల్సిందే!

1935లో కళలకు కాణాచిగా పేరుపొందిన విజయనగరంలో పుట్టిన సుశీలగారు 1953లో విడుదలైన ‘కన్నతల్లి’ సినిమాతో గాయనిగా తెలుగు లోకానికి పరిచయమయ్యారు. తొలి చిత్రంలో ఉప పాత్రధారులకు పాడిన ఆమె రెండో చిత్రం ‘పక్కింటి అమ్మాయి’లోనే నాటి అగ్ర కథానాయికలలో ఒకరైన అంజలీదేవికి పాడారు. అది మొదలు 1990ల వరకూ ఆ గళానికి అలూపూ లేదు, విశ్రాంతీ లేదు. తెలుగు, కన్నడ, మళయాళ భాషలలో అగ్రేసర గాయనిగా కొనసాగిన సుశీలగారు హిందీ, ఒరియా, సింహళ భాషలలో కూడా పాడారు. ఆమె పాడిన మొత్తం పాటలు 20 వేల వరకూ ఉంటాయని అంచనా. ఒక్క తెలుగులోనే దాదాపు 7 వేల పాటలు పాడారు.

నేను నేనే సుమా!
సుశీలగారు అనగానే కొన్ని హిట్‌ సాంగ్స్‌ గుర్తుకురావడం సహజం. ఎన్నో గీతాలు ఆమె నోటి నుంచి జాలువారి అమృత గుళికలయ్యాయి. ‘మోహినీ భస్మాసుర’ చిత్రంలో మోహని పాత్రధారి పద్మిని ‘నేను నేనే సుమా’ అనే పాట పాడుతుంది. రాగాలాపనతో కూడిన ఆ పాట పాడడం అంత తేలిక కాదు. కానీ గొంతు తిరిగిన గాయని కదా... హాయిగా పాడేసి ‘నేను నేనే సుమా’ అనిపించారు సుశీల. ‘గుండమ్మకథ’లో ‘సన్నగ వీచే చల్లగాలికి’ పాటలో మొదట్లో ‘చల్లగాలి’ అనే మాట పలుకుతున్నప్పుడు ‘గాలి’ అనే పదం దగ్గర చల్లని గాలి తెరలు తెరలుగా వస్తున్నట్టు ఆమె వేసిన సంగతులు విని ఆనందించాల్సిందేగాని వర్ణనకు సాధ్యం కాదు.

‘అమ్మ కడుపు చల్లగా’ (సాక్షి), ‘చిన్నారి పైడిబొమ్మ’ (అమాయకురాలు), ‘నిదురపోరా బాబు నిదురపోరా’ (అంగడిబొమ్మ), ‘ప్రేమకు నేను పేదను కాను’ (ముందడుగు) వంటి పాటలు ఎంత పాపులర్‌ అయ్యాయన్న మాట పక్కన పెడితే- సుశీలగారి గొంతు కోసం ఆ పాటల్ని వినాలి. ‘కుశలమా నీకు కుశలమేనా’ (బలిపీఠం) వంటి డ్యూయెట్స్‌లో రసికత పలికితే, ‘జయ పాండురంగ ప్రభో విఠలా’ (సతీ సక్కుబాయి) పాటలో భక్తి రసం చిలుకుతుంది. ‘ఏ దేశమేగినా’ (అమెరికా అబ్బాయి) పాట మనలో దేశభక్తి రగిలిస్తే, ‘నిదురించే తోటలోకి’ (ముత్యాలముగ్గు) పాట ఆర్ద్రత నింపుతుంది. ఇక ‘లవకుశ’, ‘భక్తప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాల్లో పాటలూ, పద్యాలూ ఎంత గొప్పగా ఆలపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో పద్యాలను అంత కమ్మగా ఆలపించే మరో గాయని వస్తారా? అంటే సందేహమే!

ఎనలేని సహృదయత
మహానటి సావిత్రిగారు మహిళా సాంకేతిక నిపుణులతో తీయదలచిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాలని సుశీలగారిని అడిగారు. ‘‘సంగీత దర్శకత్వం వహించేటంతటి జ్ఞానం నాలోలేదు’’ అని సున్నితంగా తిరస్కరిస్తూనే, ‘‘సంగీతం మీద మంచి పట్టున్న గాయని పి.లీలగారు ఈ పనికి కరెక్ట్‌. వారితో చేయిస్తే బాగుంటుంది’’ అని సాటి గాయనికి అవకాశం ఇప్పించిన సహృదయురాలు సుశీల. ‘రోజుకు పది, పదిహేను పాటలూ పాడేదాన్ని’ అని గొప్పలు ఆమె చెప్పే వారు కాదు. ‘‘నేను రోజూ నాలుగు షిప్టులు మాత్రమే పని చేసేదాన్ని. అంటే నాలుగు పాటలకు మించి పాడగలిగేదాన్ని కాదు’’ అని నిజాయితీగా చెప్పేవారు.

‘ఆ ప్రత్యేకత ఆమెకే వదిలేద్దాం!’
 
    తనకు పద్మభూషణ్‌ వచ్చిన సందర్భంగా తన మానసిక గురువు, తను ఎంతగానో ఆరాధించే గాయని లతా మంగేష్కర్‌ గారిని కలిసి ఆశీస్సులు అందుకోవడానికి సుశీల ముంబాయి వెళ్ళారు. వారితోపాటు నేనూ వెళ్ళాను. లతా మంగేష్కర్‌గారూ, సుశీలగారూ... ఇద్దరూ జరీ అంచు ఉన్న తెల్లరంగు లేదా హాఫ్‌ వైట్‌ పట్టు చీరలే కడతారు. అది వాళ్ళ ట్రేడ్‌ మార్క్‌. అయితే లతగారి ఇంటికి వెళ్తున్నప్పుడు సుశీలగారు తన సహజశైలికి భిన్నంగా డార్క్‌ పింక్‌ కలర్‌ శారీని కట్టుకున్నారు. ‘‘అదేంటి, తెల్లరంగు కాకుండా ఈ కలర్‌ చీర కట్టుకున్నారు ఈవేళ?’’ అని అడిగాను. అప్పుడామె ‘‘ఏం లేదయ్యా... లతగారు వయసులో, అనుభవంలో నాకంటే పెద్ద. నా మానసిక గురువు. తెల్ల రంగు పట్టుచీర కట్టి ‘మనమిద్దరమూ ఒకటే’ అనే భావం వచ్చేలా ఆమె ముందు ప్రవర్తించినట్టు ఉంటుంది. ఆమె ఆమే. ఆ తెల్ల పట్టు చీర ప్రత్యేకతని ఆమెకే వదిలేద్దాం. అందుకే ఈ వేళ ఈ రంగు చీర కట్టుకున్నాను’’ అని వివరించారు. పెద్దలంటే ఆమెకున్న గౌరవం, ఆమె ఆలోచనా విధానంలోని వినయం నాకు స్పష్టంగా అర్ధమైంది.

‘సుశీల మాకు ఐదో సోదరి’
లతా మంగేష్కర్‌గారి ఇంటికి చేరుకున్నాం. అక్కడ కొంతమంది లతగారి బంధువులు ఉన్నారు. వారంతా దక్షిణాదిలో వివిధ ప్రదేశాలలో ఉంటారట. వారంతా సుశీలగారు వస్తున్నారు చూద్దామని వచ్చారట! నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ‘లతగారింట్లో సుశీలగారి ఫ్యాన్సా’ అని! వారు సుశీలగారిని చూడగానే మురిసిపోయి, ఆమె పాడిన తమిళ, కన్నడ పాటల గురించి పొగుడుతూ చెబుతుంటే ఆనందంతో అలా చూస్తూ ఉండిపోయాం. ఆ సందర్భంగా లతగారు మాట్లాడుతూ ‘‘హిందుస్థాన్‌లో నేను చాలామంది గాయనీమణులను చూశాను, కానీ పి.సుశీల లాంటి గాయనీమణిని చూడలేదు. సినిమా పాటలకు ఆమె స్వరం ఓ వరం. నాకు మంచి మిత్రురాలు. మేం నలుగురం అక్కాచెల్లెళ్ళం. ఐదో సోదరిగా సుశీలగారిని మేమంతా భావిస్తాం’’ అని సుశీలగారిపై తనకున్న అపార గౌరవాన్ని వెలిబుచ్చారు.

అదీ ఆమె ఔన్నత్యం
పి.సుశీల ట్రస్ట్‌ ద్వారా పి.సుశీల నేషనల్‌ అవార్డును ప్రతియేటా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ‘తొలి అవార్డు ఎవరికివ్వాలి’ అని అందరం కూర్చొని చర్చ ప్రారంభించాం. ఎస్‌.జానకి గారికిస్తే ఎలా ఉంటుందని తటపటాయిస్తూ సుశీలగారివంక చూశాం. ‘ఒకరంటే ఒకరికి ఏమన్నా ప్రొఫెషనల్‌ జెలసీ ఉంటుందేమో, బహుశా ఒప్పుకోరేమో!’ అని సందేహించాం. కానీ సుశీలగారు వెంటనే ‘‘కరెక్ట్‌ జానకే నా తొలి అవార్డుకు అర్హురాలు. ఆమెకే ఇద్దాం అని జానకిగారికే తొలి అవార్డును ప్రకటించారు. సుశీలగారి ఔన్నత్యానికి ఇదో నిదర్శనం. అనారోగ్య, ఆర్థిక కారణాలతో సతమతమవుతున్న ప్రముఖ సంగీత దర్శకుడు జె.వి. రాఘవులుగారి కోసం మా సంగమం సంస్థ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, సుశీలగారు ముఖ్య అతిథిగా రావడమే కాకుండా, అప్పటికప్పుడు యాభైవేల రూపాయలను ఆయనకు బహూకరించారు. అలాగే గాయని ఉడుతా సరోజినిగారికి మేము ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమానికి సుశీలగారు విచ్చేశారు. సరోజినిగారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని వెంటనే లక్ష రూపాయలు బహూకరించి తన మంచి మనసును చాటుకున్నారు.

ఏది ఏమైనా పాట అంటే సుశీల... సుశీల అంటే పాట! ఆమె పలకని సంగతి లేదు. అనలేని స్థాయి లేదు. అందుకోని గౌరవమూ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, అన్నా లాంటి అనేక పురస్కారాలు పొందారు. ఆమెకు కావాల్సినవేమీ లేవు... రావాల్సినవే ఉన్నాయి! సుశీల లాంటి తియ్యని గొంతును అంతకు ముందు వినలేదు. ఇక వింటామన్న నమ్మకమూ లేదు. ఆ స్వరం నభూతో నభవిష్యతి! ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుపాట సంతకం పి.సుశీల. ఆమె మన జాతి సంపద!
‘సంగమం’ సంజయ్‌ కిశోర్‌
(విఖ్యాత గాయని పి.సుశీల... ‘మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ’ పురస్కారా’న్ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో అందుకుంటున్న సందర్భంగా)
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment