నక్షత్రాన్ని బట్టి పిల్లలు పేర్లు
Nakshatranni Batti Pillala Perlu
Rs. 30/-
ఆమ్... తినిపిద్దాం!

పిల్లలకు ‘ఆమ్’ తినిపించడం అమ్మలకు పెద్ద సవాలు! అన్నప్రాసన రోజు నాటి ఆనందం ఆ తర్వాత తల్లులకు మిగలదు. పిల్లాడికి పెడుతున్నది సరిపోతోందో లేదో? పోషకాలు అన్నీ అందుతున్నాయో లేదో? అసలు పెట్టవలసినవన్నీ పెడుతున్నానో లేదో? ఇలా... తల్లులకు పిల్లల పోషణ గురించి లెక్కలేనన్ని అనుమానాలు! ఘనాహారం మొదలు పెట్టినప్పటి నుంచి పిల్లలకు ఏం తినిపించాలి? ఎలా వండాలి? వేటిని దూరం పెట్టాలి? ఈ విషయాల గురించిన అవగాహన ప్రతి తల్లికీ అవసరం.
ఆరో నెల నుంచి పిల్లలకు ఘనాహారం మొదలు పెట్టవచ్చనేది మనందరికీ తెలిసిన విషయమే! అయితే వంశపారంపర్యంగా నడుస్తూ వస్తున్నది, ఎక్కడో విన్నది, ఇరుగు పొరుగు సూచించేది, మార్కెట్లో దొరికే మిల్క్ ఫుడ్... వీటిలో దేన్ని అనుసరించాలనే అయోమయం ప్రారంభంలో ప్రతి తల్లికీ మొదలవుతుంది. చివరికు అందుబాటులో ఉన్నది, తేలికగా తయారయ్యేది, పెద్దలు సూచించినదాన్నే ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆరో నెల నుంచి సంవత్సరం వయసు వరకూ, ఏడాది వయసు నుంచి రెండేళ్ల వరకూ పిల్లలకు అందించే ఆహారంలో వయసు పరంగా మార్పులు చేస్తూ ఉండాలి. సరిపడా పోషకాలు అందేలా ఆహారాన్ని తయారు చేయడంలో రకరకాల పద్ధతులను ఎంచుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినేలా నేర్పు, ఓర్పుతో వండి పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏ వయసు పిల్లలకు ఎలాంటి ఆహారం అవసరమో అవగాహన ఏర్పరుచుకోవాలి.
6 నుంచి 12 నెలల పిల్లలకు...

ఆరో నెల నుంచి సాధారణంగా అన్నంలో పప్పు, నెయ్యి కలిపి తినిపించడం మొదలు పెడతాం! కానీ వీటి ద్వారా బిడ్డకు అందే పోషకాలు అతి స్వల్పం. కాబట్టి....
పప్పుధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు, పులుపు లేని పళ్లు తినిపించాలి.
రుచి కోసం నెయ్యి వాడొచ్చు. కానీ చాలా పరిమితంగా వాడాలి. నెయ్యి బదులు ఎలాంటి వెజిటబుల్ ఆయిల్ అయినా అన్నంలో కలిపి పెట్టొచ్చు.
ఉప్పు, తీపి... ఈ రెండూ పదార్థాల రుచిని పెంచే మాట నిజమే అయినా, పసికందులకు వీటిని అలవాటు చేయకూడదు. వీటికి బదులుగా రుచి కోసం పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడులను వంటకాల్లో కలిపి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
తీపి పెట్టాలనుకుంటే తగు మాత్రంగా బెల్లం వాడొచ్చు.
నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే నీళ్లలో బెల్లం లేదా పళ్ల ముక్కలు వేసి తాగించవచ్చు.
తొమ్మిదో నెల నుంచి గుడ్డు పచ్చసొన తినిపించవచ్చు.
ఉడికించే ఆహారం మెత్తగా ఉండాలి.
ప్రతి పూటా అన్నమే తినిపించాలని లేదు. అన్నం బదులు కూరగాయ ముక్కలను తగుపాళ్లలో మసాలాలు జోడించి తినిపించవచ్చు. ఉడికించి, చిదిమిన పళ్ల ముక్కలు తినిపించవచ్చు.
పెద్దలతో సమానంగా పిల్లలూ మూడు పూటలు తినాలి అనుకుంటే పొరపాటు. ఒకేసారి ఎక్కువ పరిమాణాల్లో పిల్లలు తినలేకపోతే, అదే పరిమాణాన్ని 6 భాగాలుగా వేర్వేరు సమయాల్లో తినిపించవచ్చు.
ప్రయాణాల్లో, ఇంటి భోజనం వండలేని సమయాల్లో మాత్రమే సెరెలాక్ లాంటి ప్రత్యామ్నాయ మిల్క్ ఫుడ్ ఇవ్వాలి. దీన్లో చక్కెర కలపకూడదు.
ఇవి కూడదు
ఈ వయసు పిల్లలకు తినిపించకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే....
ఎలర్జీ తలెత్తకుండా ఉండాలంటే కొత్తగా ఏ రెండు కొత్త పదార్థాలనూ కలిపి తినిపించకూడదు. ఒకదాని తర్వాత మరొకటిగానే రుచి అలవాటు చేయాలి.
ఈ వయసు పిల్లలకు నట్స్ నుంచి ఎలర్జీ లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి వేరుసెనగ, బాదం, జీడిపప్పు లాంటివి పొడి రూపంలో కూడా తినిపించకూడదు.
సంవత్సరం లోపు పిల్లలకు తేనె, ఉప్పు, చక్కెర తినిపించకూడదు. తీయదనం కోసం బెల్లం వాడొచ్చు.
బాస్మతి లాంటి పాలిష్ పట్టిన బియ్యం వాడకూడదు.
9 నెలల వరకూ గోధుమలు, గుడ్డు తినిపించకూడదు.
ఐస్‌క్రీమ్‌లు, బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు.
గేదె, ఆవుపాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇవ్వకూడదు.
ఎలా తినిపించాలి?
చాలా మంది తల్లులు పిల్లలను ఒళ్లో పడుకోబెట్టుకుని స్పూన్‌తో ఆహారం తినిపిస్తూ ఉంటారు. కానీ పిల్లలను ఒళ్లోనే కూర్చోబెట్టుకుని తినిపించాలి. లేదంటే ఆహారం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒళ్లో లేదా మంచం మీద పిల్లలను 60 నుంచి 90 డిగ్రీల కోణంలో వెనక వీపు ఆనుకునేలా చూసుకుని తినిపించాలి. లేదంటే ఫీడింగ్ ఛైర్ వాడొచ్చు.
12 నుంచి 18 నెలల పిల్లలకు...
ఈ వయసు వచ్చేసరికి తల్లి పాలు కూడా తగ్గుతాయి కాబట్టి ఆ పాలకు బదులుగా అందాల్సిన పోషకాలన్నీ ఆహారం ద్వారా అందేలా చూడాలి. అందుకోసం రకరకాల పదార్థాలను పరిచయం చేయాలి. దంతాలు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి పదార్థాలను మెత్తగా కాకుండా నమిలి తినగలిగే విధంగానే వండాలి. మూడు పూటలా ఘనాహారం తప్పనిసరిగా తినిపించాలి. అయితే ఈ వయసు పిల్లల పోషణలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటంటే....
18 నెలల వయసొచ్చేలోపు మనందరం తినే పదార్థాలను ఒక్కొక్కటిగా అలవాటు చేస్తూ పోవాలి.
మాంసాహారం అలవాటు చేయాలనుకుంటే మొదట చికెన్ సూప్, తర్వాత చికెన్ కుర్మా... ఇలా ఒక క్రమ పద్ధతిని పాటించాలి.
అల్పాహారంగా చట్నీతో ఇడ్లీ, గోధుమ పిండితో తయారయ్యే చపాతీ, పరాఠా... ఇలా అన్ని రకాల అల్పాహారాలు తినిపించవచ్చు.
రాగులతో తయారైన వంటకాలు, బేబీ ఓట్లు ఇవ్వవచ్చు. కిచిడీ, రైస్ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, రాగి ఇడ్లీ... ఇలా వీలైనన్ని ఎక్కువ పప్పుధాన్యాలను అలవాటు చేయాలి.
ఈ వయసులో స్టార్చ్ (పిండి పదార్థం) ఉండే బంగాళా దుంపలు, చిలగడ దుంపలు, బీన్స్ అలవాటు చేయొచ్చు.
పుల్లని పండ్లు సహా, రోజుకి రెండు రకాల పండ్లు తప్పనిసరిగా తినిపించాలి.
కూరగాయలతో సూప్స్, రసాలు, సలాడ్లు ఈ వయసులోనే అలవాటు చేయాలి.
బజార్లో దొరికే తీపి పదార్థాలకు బదులుగా బెల్లంతో చేసిన పాయసం, పొంగల్ లాంటివి అలవాటు చేయాలి.
సాధ్యమైనంత వరకూ ఇంటి ఆహారాన్నే తినిపించాలి.
శాకాహారులు సరిపడా మాంసకృత్తుల కోసం పుట్టగొడుగులు, సోయా, చిక్కుళ్లు పిల్లలకు వండి పెట్టాలి.
వారానికోసారి ఇంట్లో తయారు చేసిన స్వీట్లు తినిపించవచ్చు.
అరుదుగా చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ ఇప్పించవచ్చు.
పిల్లల వెంట పడొద్దు
పిల్లలకు అన్నం తినిపించడాన్ని తల్లులు పెద్ద పనిగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆకలేస్తే పిల్లలు వాళ్లంతట వాళ్లే ఇష్టంగా, తమకు సరిపడా తింటారనే విషయాన్ని గ్రహించాలి. కుదురుగా కూర్చుని తినే పిల్లలు అరుదు. కాబట్టి వాళ్లకు కబుర్లు చెబుతూ, నడిపిస్తూ తినిపించవచ్చు. ఆహారాన్ని అందంగా తయారు చేసి పిల్లలను ఆకర్షించవచ్చు. కూరగాయలు, పండ్లను కార్టూన్ బొమ్మల్లా మలిస్తే పిల్లలే పరుగెత్తుకుంటూ వచ్చి తింటారు. ఇష్టపడని కూరగాయలు, పండ్లను ఇందుకోసం ఎంచుకోవచ్చు. పిల్లలు ఎంత తిన్నా సరిపడా తినలేదని తల్లులు దిగులు పడుతూ ఉంటారు. కానీ పిల్లల ఎత్తు వయసుతోపాటు సమంగా ఉంటే దిగులు పడవలసిన అవసరం లేదు. అలాగే కొంతమంది పిల్లలు సరిపడా తింటున్నా బరువు పెరగరు. వీళ్ల విషయంలో ఎత్తు, చలాకీతనాలను గమనించాలి. అవి ఉంటే కంగారు పడవలసిన పని లేదు.
- డాక్టర్ నిటాషా బగ్గ
కన్సల్టెంట్ నియో నాటాలజిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment