నాగదేవతలు | NagaDevatha |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

నాగదేవతా సర్వస్వం
 NagaDevata Sarvaswam
Rs 108/-
నాగపంచమి 


   భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. నాగేంద్రుడు శివుడికి హారమైతే, కేశవుడికి తల్పమయ్యాడు. హైందవ సంప్రదాయాల్లోనేగాక- జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న ప్రతిమలు కొన్నిచోట్ల లభించాయి. సర్పపూజ మొదట అనార్య సంస్కృతి చిహ్నంగా ఉండి, తరవాత వైదికముద్ర పొందినట్లు గోచరిస్తోంది.

    తెలుగునాట నాగారాధన చిరకాలంగా విశేష ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధ వాజ్ఞ్మయంలో నేటి తెలుగు వారి ప్రాంతాన్ని ‘నాగభూమి’గా వ్యవహరించారు. శాతవాహనులనాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుడి పేరులో ‘నాగ’ శబ్దం ఉంది. అమరావతి స్తూపం మీద ‘నాగబు’ పదం ఉంది. నాగశబ్దంతో కూడిన గ్రామ నామాలు, వ్యక్తి నామాలు తెలుగునాట ప్రసిద్ధంగా కనిపిస్తాయి. శ్రావణశుద్ధ పంచమిని నాగపంచమిగా, గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. భవిష్యత్‌ పురాణంలో నాగపంచమి ప్రస్తావన ఉంది.

    ఉచ్చైశ్రవమనే గుర్రం పాల సముద్ర మథనంలో ఉద్భవించింది. అది తెల్లని వర్ణం గలది. కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్రతీరాన విహరిస్తూ దూరం నుంచి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని చెప్పింది. వినత అంగీకరించక గుర్రం దేహమంతా తెల్లగానే ఉందన్నది. కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే వినతకు దాసి అయ్యేలా పందెం వేసుకున్నారు. మర్నాడు వచ్చి చూద్దామని వెళ్లిపోయారు. కద్రువ కపట బుద్ధితో తన కుమారులైన నాగుల్ని పిలిచి గుర్రం తోకను పట్టుకు వేలాడమని కోరింది. వారు దానికి అంగీకరించలేదు. సర్పయాగంలో నశించాలని వారికి కద్రువ శాపం ఇచ్చింది. కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి ఆమె చెప్పినట్లు చేశాడు. దూరం నుంచి గుర్రం తోక నల్లగా కనిపించడంతో వినత ఓటమిని అంగీకరించి సవతికి దాసి అయింది. వినత కుమారుడైన గరుడుడు తల్లి దాస్య విముక్తికోసం ఇంద్రుణ్ని ఎదిరించి అమృతం తెచ్చి ఇస్తాడు. ఆ తరవాత నాగులపై కోపంతో వారిని భక్షిస్తుంటాడు. పాములు ప్రాణభయం తగ్గించుకోవడం కోసం రోజుకో సర్పాన్ని గరుడుడికి ఆహారంగా పంపడానికి నాగరాజు వాసుకి ఒడంబడిక చేసుకొంటాడు. 

జీమూత వాహనుడనే విద్యాధర యువకుడు పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా సర్పాల మృత అవశేషాలను చూశాడు. ఆ రోజున గరుడుడికి ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వచ్చాడు. అతడి వెంట రోదిస్తూ అతడి తల్లి కూడా వచ్చింది. కరుణాళువైన జీమూత వాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుణ్ని కాపాడదలచాడు. ఎర్రటి వస్త్రాన్ని ధరించి వధ్య శిలపైన ఎక్కగా గరుడుడు అతణ్ని భక్షించసాగాడు. జీమూత వాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని రక్షించమని ప్రార్థించారు. జరిగిన తప్పు గ్రహించిన గరుత్మంతుడు ఇంద్రుణ్ని ప్రార్థించి అమృతంతో జీమూత వాహనుణ్ని రక్షించడమేగాక హతులైన సర్పాలను బతికించాడు. సర్పజాతిని హింసించనని మాట ఇచ్చాడు. ఆ రోజే నాగపంచమి.

చతుర్థినాడు ఉపవసించి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజించాలని శాస్త్ర వచనం. వ్రత చూడామణి గ్రంథం ‘నాగద్రష్ట వ్రతం’ గురించి పేర్కొన్నది.

పంటలను సర్పజాతి వృద్ధి చేస్తుందని, పుత్ర సంతానం ప్రసాదిస్తుందని ప్రజల విశ్వాసం. సర్పాలు భూమిలోని నిధి నిక్షేపాలకు కాపాలాదారులనే భావన ఉంది.- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

#Kalabhairava
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment