కేదారేశ్వర వ్రతం | Kedareswara Vratam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

కేదారేశ్వర వ్రతం 
 Kedareswara Vratam
Rs12/-


ప్రతి రోజూ పుణ్యప్రదమే!


కార్తిక మాసంలో అడుగుపెట్టాం! వేకువ స్నానం, శివాభిషేకం, దీపారాధనం, ఉపవాసం... ఈ మాసంలో చేయాల్సినవెన్నో! అన్నీ పుణ్యప్రదమే! ఏమిటీ మాసంలోని ఆ విశేషం?


భారతీయ సంస్కృతిలో నక్షత్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. చాంద్రమానాన్ని అనుసరించి, కృత్తికా నక్షత్రంతో కూడిన పున్నమి నాడు చంద్రోదయం అయ్యే మాసం కనుక ఇది కార్తిక మాసం. ఇది ఆధ్యాత్మికతను అనుసరించేవారికి అమృతత్త్వాన్ని అందిస్తుంది. దేవతలకు కూడా అమృతతుల్యమైన ఈ మాసం హరిహరులకూ, శక్తికీ ప్రియమైనది. వారి ఆరాధనకు అనువైనది. కార్తిక మాస మహాత్మ్యాన్ని తొలుత జనక మహారాజుకు వశిష్టుడు వివరించాడనీ, అది విన్న సూతుడు సత్రయాగంలో శౌనకాది మహర్షులకు వివరించాడనీ పురాణ కథనం.


కార్తిక మాసంలో శివునికి అభిషేకాలూ, హరిహరులిద్దరికీ అర్చనలూ, శక్తి పూజలూ నిర్వర్తించడం వైదిక సంస్కృతిలోని ప్రధానాంశం. సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, చన్నీటి స్నానాలు చేసి, హరిహరాదులను అర్చించడం ఎంతో విశిష్టమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా ఆలయాల్లో దీపారాధన, దీపదానం ఎంతో పుణ్యప్రదమని చెబుతున్నాయి. ఆయా తిథులు, వారాలలో ఆచరించవలసిన పూజా విధానాలనూ, వ్రతాలనూ పూర్వ ఋషులు సవివరంగా తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.


కైవల్య ప్రదాయిని... కార్తీకం!
కార్తిక మాసం ఎన్నో పర్వాల సమాహారం. ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. ఈ రోజుల్లో చేయాల్సిన విధి విధానాలను తెలుసుకొని ఆచరిస్తే, ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. ప్రతి పర్వానికీ సంబంధించిన కథలు ఇతిహాసాల్లో, పురాణాల్లో ఉన్నాయి. వాటి ప్రకారం:


వేకువ స్నానంలో విశేషం
కార్తిక మాసంలో వేకువనే నదీ, తటాక, కూపాల్లో ఏది లభ్యమైతే అందులో స్నానం చేయాలి. ఒక పాత్రతో జలాన్ని తీసుకొని, అందుబాటులో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించడం, విష్ణ్వాలయంలో కేశవుని ‘దామోదర ప్రీత్యర్థం’ అని సంకల్పం చెప్పుకొని పూజించడం, తరువాత భగవధ్ధ్యానం, స్తోత్ర పఠనం, జపం చేస్తూ గడపాలి. సమీపంలో శివ, కేశవ ఆలయాలు లేకపోతే మరే ఇతర దేవాలయానికైనా వెళ్ళవచ్చు. భగవంతుడిని హృదయంలో నిలుపుకొని- రావి చెట్టు దగ్గర కానీ, ఇంట్లో తులసికోట దగ్గర కానీ ధ్యానించవచ్చు.

కార్తికమాసం స్నానాలకూ, దీపారాధనకూ ప్రత్యేకమని తత్త్వనిష్ఠోపాఖ్యానంలో వశిష్టుడు చెప్పినట్టు కార్తిక పురాణం పేర్కొంటోంది. చేయకూడని పనుల ప్రస్తావన కూడా ఇదే ఉపాఖ్యానంలో ఉంది. కార్తికమాసంలో చేసే స్నానాల వల్ల- తెలియక చేసిన పనులు, గతంలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారని చెబుతోంది.


దీపారాధన ఎందుకంటే...
రెండవది దీపారాధన. కృత్తికా నక్షత్రం అగ్నిదేవతకు ప్రతీక. అగ్నిష్ఠోమాత్మకం. అంటే చంద్రునితో కూడి ఉండడం వల్ల కార్తిక మాసం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యతేజం మందగించి, చలి పెరుగుతుంది. వాతావరణం ఉష్ణానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఉష్ణం కోసం చలి మంటలు వేయడం కనిపిస్తుంది. అంటే అగ్న్యారాధనగా భావన చేయవచ్చు. అగ్న్యారాధనను దీపం రూపంలో చేయాలని పురాణాలు వచిస్తున్నాయి. ఈ విధంగా దీపారాధన విశేష ప్రాచుర్యం పొందింది.

అంధకారం అలుముకున్నప్పుడు కళ్ళకు వస్తువులు కనబడేటట్టు చేసేది దీపం. ఒకసారి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు ప్రపంచం అంతా చీకటిమయం అయితే దిక్కేది? అనే సంశయం కలిగిందట. అప్పుడు నేనున్నానని దీపం అభయం ఇచ్చిందట. రవీంద్రుడు స్వయంగా చెప్పిన మాటలివి. దీపం బాహ్యాభ్యంతరాలలోని చీకటిని పోగొట్టే శక్తి కలిగినది. మనలోని అజ్జ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగులోకి నడిపించేది. సాధారణ దీపాలు పరప్రకాశాలు. పరమేశ్వరుడు, పరాశక్తి, సూర్యచంద్రులు- వీరు స్వయంప్రకాశం కలిగినవారు. మనం కోరుకోవలసింది స్వయంప్రకాశాన్ని. ‘మన శరీరంలోని చైతన్యమే దీపం!’ అని శ్రీదక్షిణామూర్తి స్తోత్రం చెబుతోంది. ఆ చైతన్యమే ఇంద్రియాల ద్వారా ప్రకటితం అవుతుంది. వివేకాన్నీ, విచక్షణనూ కలిగిస్తుంది. పాపాలకు పరిహారం చేసే శక్తి దీపానికి ఉంది. అది మమత్వాన్ని హరిస్తుంది. అవిద్యనూ, అజ్ఞానాన్నీ తొలగిస్తుంది. అందుకని కార్తిక మాసంలోనే కాకుండా ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేయాలని శాస్త్రాలు అంటున్నాయి.


అభిషేక ప్రాధాన్యం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ‘కాలాగ్ని రుద్రాయ’ అని కూడా స్తుతిస్తాం. శివుని ఫాలభాగం అగ్ని క్షేత్రం. మూడో కన్ను అగ్ని రూపం. దాన్ని చల్లబరచడానికి చంద్రరేఖ, గంగ ఉన్నాయి. అయినా ఆ శీతలం చాలదు. కారణం ఏమిటంటే, కృత్తికా నక్షత్రం అగ్నిదేవతాత్మకమైనది. కార్త్తికమాసంలో అది మరింతగా ప్రజ్వలిస్తుంది. అందుకే ఈ మాసంలో శివాభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి. అభిషేకం చేసేటప్పుడు చంద్రుడి మీదుగా జరుగుతుంది. ఓషధతత్త్వం గల చంద్రుని మీదుగా వచ్చే జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా, మనలోని ఉష్ణప్రకోపం తగ్గి, అకాల మరణం ప్రాప్ర్తించదు. వ్యాధుల నివారణ జరుగుతుంది.


వనభోజనాలతో సామరస్యం
లౌకికంగా ఈ మాసంలో చేసుకొనే సామాజికపరమైన వేడుక వనభోజనం. కుల, మత, వర్గ, వయో భేదం లేకుండా, స్త్రీపురుషులందరూ కలిసి, మెలసి ఒక వనం (తోట)లో పరస్పరం సహకరించుకుంటూ వంటా వార్పూ చేసుకొని, కార్తీక దామోదరునికీ, పార్వతీపరమేశ్వరులను ఉసిరిక చెట్టు దగ్గర పూజించి, వండిన పంచభక్ష్యాదులను నివేదించి, సామూహికంగా చెట్ల నీడలో భుజించడం ఒక మరపురాని అనుభూతి. ఈ విధంగా ఒక వేడుక హృదయానందాన్నేకాక, సామాజిక సమరసతకు కూడా దోహదం చేస్తుంది.


ఏ రోజు ఏం చేయాలి?
తిథుల పరంగా చూస్తే- కార్తిక మాసంలో ప్రతి తిథికీ ప్రాధాన్యం ఉంది.
గోవర్ధన పూజ: కార్తిక శుద్ధ పాడ్యమి నాడు కార్తీక వ్రతారంభం చేసేవారు ఆకాశదీపాన్ని ప్రదోష సమయంలో వెలిగిస్తారు. అది సాధ్యం కానివారు ఆ దీపాన్ని దర్శించినా అంతే ఫలితం పొందుతారు. శివాలయాలలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఆ రోజున గోవర్ధన పూజ చేయాలి. అవకాశం లేనివారు అష్టమి నాడు గోపాష్టమి నిర్వహించవచ్చు.

భగినీ హస్త భోజనం: విదియ నాడు యమున ఆహ్వానం మేరకు ఆమె సోదరుడైన యమధర్మరాజు విందు ఆరగిస్తాడు. కానుకలు ఇస్తాడు. సోదరి ఇంట విందు ఆరగించేవారు మరణానంతరం నరకలోకం సందర్శించరని వరమిస్తాడు. ‘ప్రీతి విదియ’గా ఈ రోజు ప్రాచుర్యం పొందింది. ‘భగినీ హస్త భోజనం’గా ఉత్తరాదిన జరుపుకొంటారు.

జగన్మాత పూజ: తదియ నాడు జగన్మాతను కుంకుమతో పూజించి, సౌభాగ్య సిద్ధి పొందవచ్చు.

నాగుల చవితి: చవితి, పంచమి తిథులు నాగుల చవితిగా, నాగ పంచమిగా ప్రసిద్ధం. ఈ రోజుల్లో పుట్టలోని నాగులను కుటుంబ సమేతంగా ఆరాధిస్తారు. నాగదేవతకు పండ్లు, పాలు, చలిమిడి, చిమ్మిరి, వడపప్పు నివేదించి, పుట్టమన్నును చెవికి పూసుకుంటారు. ఇలా చేస్తే వినికిడి లోపం కలగదని నమ్మకం. నాగేంద్రుడికి ఎర్రటి గళ్ళున్న వస్త్రాన్ని సమర్పిస్తారు.

సుబ్రహ్మణ్యారాధన: షష్టి రోజు సుబ్రహ్మణ్యారాధనకు ప్రత్యేకమైనది. కృత్తికలు పెంచిన సుబ్రహ్మణ్యుడు శరవణభవునిగా పిలుపునందుకుంటున్నాడు.

ఉత్థాన ఏకాదశి: కార్తిక శుధ్ధ ఏకాదశిని ‘బోధనైకాదశి’ అనీ, ‘ఉత్థాన ఏకాదశి’ అనీ అంటారు. ఆషాఢమాసంలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు ఈ రోజున మేలుకుంటాడు. విష్ణ్వాలయాల్లో ఈ రోజు ఘనంగా పూజలు జరుగుతాయి. చాతర్మాస్య వ్రత దీక్షలు ఈ రోజుతో పరిసమాప్తమవుతాయి.

క్షీరాబ్ధి ద్వాదశి: దీన్ని ‘చిలుకు ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున క్షీరసాగర మథనం ప్రారంభమయింది. ఇదే రోజున సాగరం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించింది. క్షీరాబ్ది ద్వాదశి గురించి భాగవతంలోనూ, పలు పురాణాల్లోనూ కథలున్నాయి. ఈ రోజున శ్రీహరికీ, మహాలక్ష్మికీ విష్ణ్వాలయాల్లో కల్యాణం జరుగుతుంది. బృందావనం (మథురకు సమీపంలో) శ్రీ మహా విష్ణువుకూ, తులసి (బృంద)కీ వివాహం జరుగుతుంది. తెలుగునాట గృహిణులు తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి, దీపాలు వెలిగించి, విష్ణువుకు ప్రతీకగా ఉసిరిక కొమ్మను నాటి తులసీ కల్యాణం చేస్తారు. చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, ప్రసాదంగా అందరికీ పంచుతారు. శంఖచూడుడు, బృందల కథను పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించారు.

కార్తిక పౌర్ణమి: కార్తిక పూర్ణిమ మహిమాన్వితం, పవిత్రమైనది. శివకేశవులకూ, శక్తికీ ఈ రోజున విశేషమైన ఆరాధనలు జరుగుతాయి. ఈ రోజు చేసే స్నాన, జప, ధ్యానాదులు విశేషమైన ఫలితాలనిస్తాయి. తెలుగునాట ఈ రోజున 33 పున్నముల వ్రతాలు చేస్తారు. తులసికోట దగ్గర 365 వత్తులను నేతిలో వెలిగించి, లక్ష్మీ నారాయణులకు సమర్పిస్తారు. ‘దేవ దీపావళి’గా కాశీక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. శివాలయాలలో జ్వాలాతోరణం ఉత్సవం జరుగుతుంది. పార్వతి తన భర్త శివుడు క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగినప్పుడు, తన మాంగల్యం మీద నమ్మకంతో, భర్తకు ఎలాంటి ఆపద కలుగకూడదని కోరుకుంటూ, జ్వాలాతోరణం కింద నుండి భర్తతో తిరుగుతానని మొక్కి, దాన్ని తీర్చుకున్నదని కథనం. త్రిపురాసుర సంహారానంతరం భర్తకు స్వాగతం ఇచ్చిన విధం ఈ ‘జ్వాలాతోరణం’ అని మరొక కథ.
కార్తిక సోమవారం ఉపవాసాలు, అభిషేకాలు, నక్తవ్రతాలు, చన్నీటి స్నానాలు.. ఇవన్నీ ఆయుర్వేదరీత్యా ముఖ్యమైనవిగా చెబుతారు. -ఎ. సీతారామారావు 
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment