సర్వదేవతా మంత్ర యంత్ర తంత్ర కవచములు | SarvaDevata Mantra Yantra Tantra Kavachamu l సర్వదేవతా మంత్ర యంత్ర తంత్ర కవచములు | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


సర్వదేవతా
 మంత్ర యంత్ర తంత్ర కవచములు 
 SarvaDevata 
Mantra Yantra Tantra Kavach
Rs 63/-
#సహజకవచం 
#సహస్రకవచుడు

ప్రాణరక్షణకు కవచాలు ధరిస్తారు. అవి ఆయుధాల నుంచి కాపాడతాయి. అస్త్రాలకు వరకవచాలు ఉండాలి. పురాణాల్లో రాక్షసులు ఘోర తపస్సులు చేసి వరకవచాలు పొందేవారు. అవి కంటికి కనిపించవు. కానీ, అమోఘ శక్తితో అస్త్రాలనుంచి రక్షిస్తాయి.
సహస్ర కవచుడు బ్రహ్మనుంచి వెయ్యి వరకవచాలు పొందాడు. వరగర్వంతో విర్రవీగి, లోకాలను పీడించడం ప్రారంభించాడు. దుష్టశిక్షకుడైన శ్రీహరి నర, నారాయణ రూపాల్లో తీవ్ర తపస్సు చేసి, ఆ శక్తితో ఒక్కటితప్ప మిగిలిన అన్ని కవచాలూ భేదించగా- ఆ ఒక్క కవచంతో పారిపోయి సూర్యుడి శరణు పొందుతాడు. కుంతి మంత్రానికి వశుడైన ఆదిత్యుడు తన వద్ద ఏకకవచంతో ఉన్న శరణార్థి ఆత్మను దైవలీలగా కుంతికి ప్రసాదిస్తాడు. అలా పుట్టినవాడే కర్ణుడు. సహజ కవచకుండలాలతో జన్మించిన కారణజన్ముడు.

మనందరికీ అదృశ్య సహజ కవచాలున్నాయి! మనిషికి జ్ఞానం వికసిస్తున్నకొద్దీ, నీడలాగా అజ్ఞానమూ వెంట ఉంటుంది. మహాపండితుడికి అహంకారం అనే నీడ, మహా ధనికుడికి గర్వం అనే దుర్లక్షణం, అధికారికి పొగరుబోతుతనం అనే చెడ్డగుణం- ఇలా ఆధిక్యత గలవారందరికీ ఏదో ఒక అవలక్షణం ఉప కవచంగా ఉంటుంది. ఆధిక్యతలన్నీ ప్రధాన కవచాలు.

స్థితప్రజ్ఞులకు, శుద్ధ సత్త్వస్వరూపులకు మానావమానాలు పట్టవు. మహావిష్ణువు మహా సత్త్వస్వరూపుడు. హృదయం మీద భృగువు కాలితో తన్నినా మందహాసంతో మన్నించాడు. ఆయన సత్త్వగుణంతో భృగువు అహంకారాన్ని పశ్చాత్తాపంగా మార్చివేశాడు. అందుకే ‘క్షమాగుణం’ మహాశక్తిమంతమైనదని పెద్దలు చెబుతారు.

రజో, తమో గుణాలుగలవారికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే కవచాలు. ఆ కవచాలే వారికి అన్ని సమస్యలూ సృష్టిస్తాయి. శత్రువుల్ని పెంచుతాయి. శ్రేయోభిలాషుల్ని దూరం చేస్తాయి.
భగవంతుడు ఎవరికీ సుఖదుఃఖాలను ఇవ్వడు. జీవుడు తన కర్మల ద్వారా సుఖదుఃఖాలను ఆర్జించుకుంటాడు. సుఖం కలిగినప్పుడు భగవంతుణ్ని ప్రశంసించని మనిషి, దుఃఖంలో ఆయనను బాధ్యుడిగా చేసి పలువిధాలుగా నిందిస్తాడు. అన్నింటికంటే ఎక్కువ పాపం- దైవనింద! 
దోషాలన్నీ తనలో ఉంచుకుని దైవాన్ని తిట్టడం సబబు కాదు. శస్త్ర చికిత్స చేసి రక్షించే వైద్యుడు శత్రువెలా అవుతాడు? కర్మఫలాలను అనుగ్రహించే పరమాత్మ కూడా అంతే. ఆ విధంగా చూస్తే ధర్మదేవత యముడు కూడా తాను విధించే నరక శిక్షలకు నింద్యుడు కాడు. స్వర్గ సుఖాలను ప్రసాదించే ఇంద్రుడు కూడా గొప్పవాడు కాడు. ఇవి రెండూ జీవుడి కర్మఫలాలే!


పుట్టుకతో అందరూ మంచివారే. జ్ఞానం కలిగేవరకు అమాయకులే. అటు తరవాత స్వయంకృషి మొదలవుతుంది. అదే తపస్సు. మనకు కవచాలను ప్రసాదించేది కృషి అనే తపస్సు. మనం ఎంపిక చేసుకునే రంగంలో మన కృషి, తపస్సు ఎంత తీవ్రంగా ఉంటే అంత ఘనంగా ఫలాలు లభిస్తాయి. అవే కవచాలవుతాయి.

విద్యాకవచం శాశ్వతం. దానికి కాలపరిమితి ఉండదు. లక్ష్మీ కవచం అశాశ్వతం. ఎప్పుడైనా తొలగిపోవచ్చు. అధికార కవచం పదవీ విరమణతో తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కవచమన్నది జారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సాధకుడిదే. జ్ఞాన కవచం- అహంకారం రానంతకాలం భద్రమే! శీల కవచం- దీన్ని కాపాడుకుంటే, ఇదే అన్ని కవచాలను కాపాడుతుంది. ధర్మశీలత్వం సత్త్వగుణం గలవారిని వదలదు. కాబట్టి, సత్త్వగుణాన్నే సహజ కవచంగా చేసుకోవాలి.

మనలోని అరిషడ్వర్గాలు, రజో తమో గుణ సంబంధమైనవిగా గ్రహించి, వాటిని ప్రయత్న పూర్వకంగా విసర్జించాలి. కల్మషాన్ని కడిగివేస్తుంటే, పరిశుభ్రత నెలకొన్నట్లు- ఆత్మకు ఖేదాన్ని కలిగించే దుష్ట కవచాలు తొలగిపోతుంటే, సహజ కవచంగా శుద్ధసత్త్వం మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. అది దివ్య కవచం. అది లభించిన క్షణంలో ‘అంతర్యామి’ దర్శనం అయాచితంగా లభిస్తుంది. మన ఆధ్యాత్మిక కృషికి అంతిమఫలం అదే! - కె.విజయలక్ష్మి

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment