గరుడ పురాణం | Garuda Puranam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గరుడ పురాణం 
Garuda Puranam 
Rs 108/-
గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా? 


పురాణ ప్రవచనాల్లోనూ, ధర్మ సందేహాల్లోనూ చాలామంది తరచుగా అడిగే ప్రశ్న.. ‘గరుడపురాణం ఇంట్లో ఉండొచ్చా?’ అని. అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని.. సాక్షాత్తూ శ్రీహరి తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదస్వరూపుడైన వేదవ్యాసులవారు గ్రంథస్థం చేశారు. ఆయన గ్రంథస్థం చేసినది చదవడానికే కదా! ఇక సంశయమెందుకు? బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు, ప్రస్తుతం లభిస్తున్న గరుడ పురాణానికి తన అభిప్రాయం రాస్తూ, ఈ గ్రంథం తప్పకుండా ఇంట్లో ఉండాల్సినదని.. పితృకర్మలు చేసే సందర్భములలో అవశ్యం పఠనీయం, శ్రవణీయం అని, అలాంటి సందర్భములలో ఈ పుస్తకాలను వితరణ చేయాలని తెలిపారు. గరుడపురాణంపై అనేక భాష్యాలు, వ్యాఖ్యానాలు, వివరణలూ ఇవ్వబడ్డాయి. ఇవ్వబడుతూ ఉన్నాయి. గరుడపురాణం పారాయణ గ్రంథంగా చెప్పబడినది.

ప్రస్తుతం లభిస్తున్నది పద్దెనిమిది అధ్యాయాలుగా సంక్షిప్తం చేయబడినది. తొలుత ఇది పంతొమ్మిది వేల శ్లోకాలుగా ఉండేది. ఆ సవిస్తర గ్రంథం కూడా లభ్యమవుతోంది. ఇహపర జీవితంలో ‘పరం’ అతి విశాలమైనదీ, తెలుసుకోదగినదీ అని గరుడ పురాణం చెబుతున్నది. భగవద్గీత, గరుడపురాణాలు మరణ సమయాల్లోనే పఠించాలన్నవి అర్థరహిత ప్రేలాపనలు. గరుడపురాణం శిక్షాస్మృతి గ్రంథం. జీవితాన్ని దిద్ది తీర్చే గ్రంథం. పెట్రేగి పోతున్న హింసాకాండని, దౌర్జన్యకాండనీ అరికట్టించే గ్రంథం. ఇహలోకంలో ధార్మికంగా సుఖించి పరలోకంలో పరమాంగతి పొందమని చెబుతున్నది. చేసే తప్పులకు శిక్ష తప్పదు అని గరుడ పురాణం బోధిస్తోంది. గరుడ పురాణం కాటికి కాళ్లు చాపుకొన్న వారి కోసం కాదు.. అబాలగోపాలానికీసంబంధించినది. గరుడ పురాణం చదివితే మనిషికి పాపభీతి కలుగుతుంది. గరుడ పురాణ పఠనాన్ని పితృదేవతలు కూడా అదృశ్య రూపంలో వచ్చి వింటారు.

ఈ పురాణంలో యముడు ప్రధాన దేవత. మన పాపపుణ్యాల వివరాలన్నిటినీ చిత్రగుప్తుని ద్వారా తెలిసికొని పాపులను తగు రీతిలో శిక్షిస్తాడు. మనం మనసులో చేసిన పాపములు కూడా గణించబడతాయి. శిక్షల అనంతరం పుటం పెట్టిన బంగారంలో స్వచ్ఛమై ప్రకాశించి పరమాత్మలో లీనమవడమో లేదా ఉత్తమ జన్మ లభించడమో జరుగుతుంది. గరుడ పురాణంలో ధర్మం, మరణ సమయ ప్రస్తావన, యమదూతల వర్ణన, నరక ప్రయాణం, యాతన దేహధారణ, వైతరణి వర్ణన, నరక బాధలు, దారిలో వచ్చు మృత్యుపట్టణాలు, నరకాలూ, కర్మరాహిత్య ఫలితాలూ, దానాల వివరణ, కర్మ విధానాలూ, దైవ, వేదాంత, స్మరణ, భక్తి విధానాలూ ఉంటాయి. ‘మానవ’ జన్మ అనే అమృత భాండాన్ని ఆస్వాదించి తరించక, చేజేతులారా పగులకొట్టుకోవద్దన్న అద్భుత హితం చెప్పిన ఈ గరుడపురాణాన్ని ఇంకా శోధించి విషయ గ్రహణ గావించుకొని సర్వులూ తరించాలి.   - వేదాంతం జగన్నాథాచార్య, 9885950072

--------------------

    గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేశే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
నాలుగవ అధ్యాయం

శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాల్గవ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు. నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది, దానిని ఎలా తప్పించుకోవాలి, వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి.పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది. దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది.దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించే వారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.

ఆరవ అధ్యాయ
ఈ అద్యాయంలో జనమరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది.గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశుకు జ్ఞాననంకలగటం జననం మరలా అజ్ఞానంలో పడటం తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది. జన్మ రాహిత్యం జ్ఞానులకు, పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది.పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు. తల్లి తిన్న పులుపు చేదు పదార్ధాల వలన వేదన పడతాడు. ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు. గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తాడు. ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూఇటూ కదలుతూ గత జన్మలో పాపపుణ్యాలనుఎరుగక చేసిన పాపకార్యాలు తలచుకుని మరింత చింతిస్తాడు. తను అర్జించిన సంపదలను అనుభవించిన భార్యా బిడ్డలు తనను పట్టించుకోక పోవడం గుర్తుచేసుకుని రోదిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన.

పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మననుసరించి నిర్ధిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన అయిదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు.పది రోజులకు రేగుపండంత కఠిమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు. ఒక మాసకాలానికి తలభాగం తయారవుతుంది.రెండు మాసాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి.మూడు మాసాల కాలానికి చర్మం, రోమాలు, గోళ్ళు, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. ఐదవ మాసానికి ఆకలి దప్పిక వస్తాయి. ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణవైపుగా కదలిక మొదలౌతుంది. ఇలా మెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది.జీవుడు దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకూపంనుండి నన్ను త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రీ. మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరి పరి విధాల ప్రార్ధిస్తాడు.ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడ్వటం మొదలు పెడతాడు.ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు, శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూట కట్టుకుని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎతుత్తాడు. ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం ఆరవ అధ్యాయం చెప్తుంది
free garuda puranam pdf   clik here
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment