గణేశ ఉపాసన 2 | Ganesha Upasana 2 | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu  గణపతి ఉపాసన  Ganapati Vupasana
గణేశ ఉపాసన 2 
Ganesha Upasana 2
Rs:108/-

గణపతి ఉపాసన
 Ganapati Vupasana

గణేశ ఉపాసన 2 | Ganesha Upasana 2 | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu  గణపతి ఉపాసన  Ganapati Vupasana

     సనాతన భారతీయ ధర్మంలో ఒకే పరమేశ్వరుడి ఆరు రూపాలతో ఆరాధించే సంప్రదాయాలు అనూచానంగా వ్యాప్తిచెందాయి. ఆ ఆరు- 1. శైవం 2. వైష్ణవం 3. శాక్తేయం 4. సౌరం (సూర్యారాధన) 5. గాణపత్యం 6. స్కాందం. ఈ షణ్మతాలు వేదాలను, మంత్ర శాస్త్రాలను ఆధారం చేసుకొని విస్తరిల్లాయి. ఈ ఆరింటిలో దేనికదే పరిపూర్ణం.

   గణపతిని పరమాత్మగా ఉపాసించే గాణపత్యం మహారాష్ట్రలోని ‘మోర్‌గాఁవ్‌’ మొదలైన అష్టవినాయక క్షేత్రాల్లో ప్రబలంగా ఉంది. గణపతి పరిపూర్ణ బ్రహ్మమనే తలంపుతో ముప్ఫైరెండు రకాల మంత్రాలతో, ఉపాస్య మూర్తులతో ఆరాధించే విధానాలు ఆయా క్షేత్రాల్లో పరంపరగా సశాస్త్రీయంగా కొనసాగుతున్నాయి.

గణపతి సూక్తం, బ్రహ్మణస్పతి సూక్తం, తాపినీయోపనిషత్తులు, అధర్వ శీర్షం, హేరంబోపనిషత్తు, ఋగ్వేదాదుల్లోని మంత్రాలను వారు అనుష్ఠిస్తారు. గణేశ పురాణం, ముద్గల పురాణం, మంత్రసంహితలను పారాయణం చేస్తారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోనూ ఈ ఉపాసనలు ప్రసిద్ధంగా ఉన్నాయి.

ప్రకృతీ పురుషతత్వమే విశ్వకారణం, విశ్వవ్యాప్తం. ఆ ప్రకృతీపురుషులే శివపార్వతులు. వారిరువురి ఏకతత్వమే గణపతి. కేవలం శివపార్వతుల పుత్రుడిగానే కాక- అనేక సందర్భాల్లో లోకరక్షణ కోసం విభిన్నమూర్తులతో విఘ్ననాథుడు సాక్షాత్కరించాడు.

అ, ఉ, మ- అనే అక్షరాలు త్రికాలాలను, త్రిలోకాలను, సృష్టి స్థితి లయలను, సత్త్వరజస్తమో గుణాలను తెలియజేస్తాయి. అంటే మూడు అక్షరాలు కలిపి- వ్యక్తమైన సగుణబ్రహ్మ స్వరూపం. నాలుగోది (తురీయం) అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మం. ఆ సగుణ-నిర్గుణతత్వమే ఓంకారం. ప్రపంచ రూపుడైన పరమాత్మ (జగం) మూడక్షరాల సగుణరూపం- ప్రపంచాతీతుడు నిర్గుణం. ఈ నిర్గుణతత్వం ‘గజ’ వదనం. సగుణతత్వం ‘జగద్రూ’పం- మానవరూపంలో కంఠం నుంచి పాదం వరకు కనిపిస్తుంది. జగతిని, జగతికి అతీతమైన తత్వాన్ని కలిపి ఒకే ఈశ్వరుడిగా ఆరాధించే జ్ఞానమే ‘గణపతి’గా ప్రత్యక్షమవుతుంది. గణనకు అందే విశ్వం ‘గణం’. దీనిలో వ్యాపించి, శాసించి దీనికి అతీతుడైనవాడే ‘ఈశుడు’. వెరసి, గణేశుడు.

భక్తితో ఆరాధించేవారి బుద్ధులను ‘తీర్చిదిద్ది’(వినయనం) స్వామి కనుక వినాయకుడు. వంకర బుద్ధులను తొలగించేవాడు వక్రతుండుడు. ‘చవితి’- తురీయ తత్వానికి సంకేతం. ధ్యానదృష్టితో త్రిగుణాలను దాటి, త్రిగుణాతీత బ్రహాన్ని(నాలుగోదాన్ని) యోగులు సమాధిస్థితిలో అనుభూతి చెందుతారు. ఆ నాలుగో భూమికలో శుద్ధ చైతన్యమే గణపతి...’ అని గణపతి ఆగమాల తత్వవివేచన.

సామాన్య దృష్టిలో- కార్యాలకు సిద్ధికి ప్రతికూలతలే విఘ్నాలు. వాటిని తొలగించి సఫలతను అనుగ్రహిస్తాడు గణపతి. వేదాంతదృష్టిలో ముక్తికి, బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకాలైన అవిద్యావృత్తులే విఘ్నాలు. జిజ్ఞాసతో నిష్కామంగా కొలుచుకొనే భక్తులకు ఆ అవిద్యను నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విఘ్నపతి- అని గణేశగ్రంథాలు వివరిస్తున్నాయి.

పూజాపద్ధతిలో- గరికలు, శమీ (జమ్మి) పత్రాలు, మారేడు, శ్వేతార్కం (తెల్ల జిల్లేడు), ఎర్రని పువ్వులు హేరంబుడికి ప్రీతి. ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్లు, నేరేడు పళ్లు, దానిమ్మ, చెరకు, కొబ్బరి, పనసతొనలు, అరటిపళ్లు, వెలగపళ్లు స్వామికి ఇష్టమైనవి. భక్తితో వీటిని అర్పించి ఆరాధించి ఉమాపుత్రుడి దయ పొందవచ్చునని పూజాశాస్త్రాలు చెబుతున్నాయి.

విచారణ పద్ధతుల్లో- స్థూల సూక్ష్మకారణ (అ, ఉ, మ) శరీరాలకు చైతన్యాన్ని ఇస్తూనే, హృదయంలో వీటికి అతీతంగా (తురీయం) భాసించే పరంజ్యోతి స్వరూపుడిగా గణపతిని జ్ఞానమార్గంలో యోగులు వివేచన చేస్తారు. ఆ సాధనా ఫలంగా విశ్వమంతా గణేశమయంగా దర్శనమిస్తుంది. సామాన్య పూజలనుంచి అసాధారణ తత్వమార్గం వరకు అందరికీ అందుబాటులో ఉండే అద్భుత స్వరూపం గణపతి!        - సామవేదం షణ్ముఖశర్మ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment