చిన్నారులకు చిరుతిళ్ళు చిట్కాలు | Chinnarulaku Chirutillu Chitkalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
చిన్నారులకు చిరుతిళ్ళు చిట్కాలు 
Chinnarulaku Chirutillu Chitkalu
Rs.30/-

ఏ సూప్‌ తాగుదాం?


వానొచ్చినా చలి తిరిగినా జలుబు చేసినా జ్వరం వచ్చినా నోరు బాగోకున్నా పొట్ట మందంగా ఉన్నా... వేడివేడి సూప్‌ తాగుతుంటారు కొందరు. హోటల్‌కి వెళ్లినప్పుడు డిన్నర్‌ లేదా లంచ్‌కి ముందు కచ్చితంగా సూప్‌ తాగేవాళ్లు మరికొందరు. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే ఉండే ఈ అలవాటు, క్రమంగా అందరికీ ఒంటబట్టింది. ఈ నేపథ్యంలో అసలీ సూప్‌ ఏమిటో, ఎందుకు తాగాలో, ఆరోగ్యానికి ఎలా మంచిదో ఓసారి చూద్దాం..! 

సూప్‌ అనగానే అబ్బా... ఆ గంజి ఎలా తాగుతారండీ బాబూ... అని నొసలు చిట్లించేవాళ్లూ లేకపోలేదు. నిజమే, అమ్మమ్మకాలం నాటి గంజినీళ్లే నేటి సూపునీళ్లు. ఒకప్పుడు తినడానికి ఏమీలేని పేదవాళ్లు కాసిని నూకల్లో నీళ్లు పోసి గంజిలా కాచుకుని తాగి కడుపు నింపుకునేవారు. సరిగ్గా ఈ కారణంతోనే అది కాస్తా మళ్లీ సూపు రూపంలో టేబుల్‌మీదకొచ్చింది. లంచ్‌, లేదా డిన్నర్‌కి ముందు కాస్త సూప్‌ తాగడం వల్ల పొట్ట కొంతమేరకు నిండుతుంది. దాంతో తరవాత మితంగా ఆహారం తీసుకుంటాం. అంటే- సూప్‌ అనేది పేదవాడికి ఆకలి తీరుస్తుంది. మరీ ఎక్కువ తినకుండా చేసి సంపన్నుల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. కాబట్టి ఎవరు ఏ కారణంతో తీసుకున్నా సూప్‌ మంచిదే.

పాతకాలం నాటిదే! 
ఒకప్పుడు జలుబు చేసినా జ్వరమొచ్చి అరగనట్లు అనిపించినా అమ్మమ్మలు మిరియాలు దట్టించిన రసం తాగమనేవారు. ఒక రకంగా అదీ సూపే. అటు చేదు నోటికి రుచిగానూ ఉంటుంది. ఇటు ఆ మిరియాల ఘాటు పొట్టనీ బాగుచేస్తుంది. అలాగే కందిపప్పు, టొమాటో, మునక్కాడ, దనియాలపొడి... ఇలా అన్నీ కలిపి చేసే రసం కూడా సూపులాంటిదే. ప్రాంతాన్ని బట్టి దీన్నే రకరకాలుగా చేస్తుంటారు. చలికాలంలో గుమ్మడి, సొరకాయ, టొమాటో, మునగ... వంటి కూరగాయలతో చేసే చారు తాగడం దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. ఇందులో కొబ్బరిపాలు, పప్పులు, ఇతర కూరగాయల ముక్కలు, మిరియాలు, లవంగాలు, చెక్క... వంటి మసాలా దినుసులనూ కలుపుతుంటారు. దానిమ్మ, మామిడి, పైనాపిల్‌, పుచ్చ... వంటి పండ్ల ముక్కలు కూడా వేస్తుంటారు కొందరు. 

మటన్‌ ముక్కల్నీ ఎముకల్నీ కొత్తిమీర, పుదీనా వంటి ఔషధ మొక్కల్నీ కలిపి బాగా మరిగించి చేసే మటన్‌ పాయా లేదా షోర్బా వాడకం మొఘల్స్‌ కాలం నుంచీ వాడుకలో ఉంది. ఎముక వ్యాధులూ గాయాలూ రక్తహీనత తదితరాలతో బాధపడేవాళ్లకి కొన్ని నెలలపాటు దీన్ని ఇస్తుంటారు. దీని తయారీ ప్రాంతాల్ని బట్టి మారుతుంటుంది. కుంకుమపువ్వు కలిపిన పెరుగులో మటన్‌ను ఉడికించి, కొద్దిగా సుగంధద్రవ్యాలు జోడించి చేసిన పాయాని చలికాలపు రాత్రుళ్లు తాగుతారు కాశ్మీరీలు. ఉలవల్ని ఉడికించిన నీళ్లలో చింతపండు వేసుకుని చిక్కగా కాచే ఉలవచారు కూడా ఓ సూపే. కొంకణితీరంలో పచ్చిమామిడికాయ రసం, కర్ణాటక వాసులు చేసుకునే కోకమ్‌ రసం... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ద్రవాహారాన్ని జీర్ణశక్తికోసం తీసుకోవడం వాడుకలో ఉంది. వీటిల్లో కొన్నింటిని నేరుగా తాగితే, మరికొన్నింటిని అన్నంలో కలుపుకుని తింటుంటారు.స్థూలంగా ఇవన్నీ సూపు కిందకే వస్తాయి.

అంటే సూప్‌ మనం ఎరగనిదీ రుచి చూడనిదీ ఏమీకాదు. క్రీ.పూ.20వ శతాబ్దం నుంచీ వాడుకలో ఉన్నదే. నేడు అది అనేక రుచుల్ని సంతరించుకుని రెడీమేడ్‌ ప్యాకెట్లలోనూ హోటళ్లలోనూ దొరుకుతోంది. కూరగాయలూ చికెన్‌, మటన్‌ వంటి వాటిని ఉడికించి చేసే పారదర్శకమైనవీ; ఆలూ, చిలగడదుంప, పాలదుంప, బియ్యం, మొక్కజొన్న... వంటి పిండిపదార్థాలను కలిపి చేసే చిక్కనివీ అని సూప్‌లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండూ కాకుండా పాలూ మీగడ, వెన్న, గుడ్డు వేసి చేసే క్రీమీ సూప్స్‌ కూడా ఉన్నాయి. 

అయితే ఇవన్నీ ఒకప్పుడు ఎవరికి వారు ఇంట్లోనే ఉడికించి చేసుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని రకాలూ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో కూడా కొన్ని పూర్తిగా పొడిరూపంలో ఉండేవీ మరికొన్ని అచ్చంగా పొడి కాకుండా పాక్షిక ఘనాహారంగా ఉండేవీ ఉంటున్నాయి. ఈ రెండో రకంలో పప్పులూ ధాన్యాలూ ఎండుపండ్లూ నట్సూ కూరగాయల ముక్కలూ చికెన్‌, మటన్‌ ముక్కలూ, నూడుల్సూ, పాస్టా... ఇలా అన్ని రకాలూ ఎండబెట్టి ప్యాక్‌ చేస్తున్నారు. దాంతో ఆయా ప్యాకెట్లలో ఆ పొడితో కూడిన ఆహారపదార్థాలను నీళ్లలో వేసి కాసేపు ఉడికించి, ఆయా ముక్కల్ని తింటూ తాగడం వల్ల అన్నిరకాల పోషకాలూ లభిస్తాయి. నీటిశాతం తక్కువగా ఉండి మూడు వంతులకు పైగా ఘనాహారం ఉంటే దాన్ని స్ట్యూ అంటారు. సూప్‌లో ద్రవశాతమే ఎక్కువ. అందుకే ఈ సూప్స్‌ అండ్‌ స్ట్యూస్‌ని భోజనానికి బదులుగానూ తీసుకుంటారు కొందరు.
అసలెందుకీ సూప్‌? 

సూప్‌లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో పోషకాలన్నీ ఒంటికి పట్టి చర్మం తాజాగా ఉంటుంది. భోజనానికి ముందు దీన్ని తీసుకోవడంవల్ల అందులోని సుగంధద్రవ్యాలు జీర్ణవ్యవస్థని మేల్కొలిపి, చక్కగా పనిచేసేలా చేస్తాయి. 

* కూరగాయలు, మటన్‌, చికెన్‌, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న... ఇలా భిన్న పదార్థాలను ఉడికించి సూప్‌ చేస్తుంటారు. అందులో వాడేవాటిని బట్టి వాటిల్లో అన్నిరకాల ఖనిజాలూ విటమిన్లూ ప్రొటీన్లూ పీచూ లభ్యమవుతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం లేకుండా చేస్తాయి. ముఖ్యంగా కూరగాయల్ని ఉడికించి చేసే సూపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల పొట్ట నిండుతుంది. పిండిపదార్థాలూ స్వీట్లూ స్నాక్సూ తియ్యని శీతలపానీయాలూ వంటివి తినడం తగ్గుతుంది. దాంతో బరువూ తగ్గుతారు. 

* భోజనానికి ముందు సూప్‌ తీసుకోవడంవల్ల 20 శాతం క్యాలరీలు తక్కువగా తీసుకుంటారని పరిశీలనల్లో తేలింది. పైగా కూరగాయల సూప్‌లో ఉండేవన్నీ సంక్లిష్ట పిండిపదార్థాలు కావడంతో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర నిల్వలు పెరగవు. మధుమేహులకీ ఎంతో మంచిది. 

* బీన్స్‌, ఆలూ, చిలగడదుంప, చికెన్‌, నూడుల్స్‌, రైస్‌, లెగ్యూమ్స్‌, పాస్టా... వంటివాటిని సూప్‌ రూపంలో తీసుకున్నప్పుడు వాటిల్లో కొన్ని క్యాలరీలు ఉంటాయి ఆ మేరకు లంచ్‌ లేదా డిన్నర్‌లో ఆహారం తగ్గించుకోవాలి. 

* మటన్‌ఎముకలతో చేసే పాయాలో కాల్షియంతోబాటు ఇతర ఖనిజాలూ అమైనోఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముక గాయాలయిన వాళ్లకి దీన్ని క్రమం తప్పక ఇస్తే త్వరగా కోలుకుంటారు. 

* సూపుల్లో ఉల్లి, లీక్స్‌, కొత్తిమీర... వంటివి వాడటం వల్ల పొటాషియం ఎక్కువగా లభ్యమవడంతోబాటు అది శరీరంలో అధికంగా ఉన్న సోడియంను బయటకు పంపేందుకు తోడ్పడుతుంది. 

* చలికాలంలో వేడివేడిగా సూప్‌ తీసుకోవడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది. కాబట్టి సూప్‌ను లంచ్‌, డిన్నర్‌ అన్న సందిగ్ధం లేకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే రెడీమేడ్‌ ప్యాక్స్‌ కొనేటప్పుడు కొన్నింటిలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి. పైగా వాటిల్లో బేస్‌ ప్రొడక్ట్‌ కోసం ఎక్కువగా ఆలూ లేదా కార్న్‌ స్టార్చ్‌ కలుపుతుంటారు. వాటిల్లో ప్రొటీన్లకన్నా పిండిపదార్థాల శాతం ఎక్కువ. కాబట్టి, అవకాశం ఉన్నవారు తాజా కూరగాయలతో ఇంట్లోనే సూప్‌ తయారుచేసుకోవడం అన్నివిధాలా మేలు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment