ఆంజనేయ సహస్రనామాలు | Anjaneya Sahasranamaalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఆంజనేయ సహస్రనామాలు 
 Anjaneya Sahasranamalu
Rs 27/-




శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీతీరాన ఉందీ వాయుక్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. 

యత్రయత్ర రఘునాథ కీర్తనం 
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌! 
భాష్పవారి పరిపూర్ణ లోచనం 
మారుతిం నమత రాక్షసాంతకమ్‌!! 

అంటే... శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్న వదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడు. అంతటి స్వామిభక్తి పరాయణుడైన అంజనీసుతుడు కాలిడిన చోట మహాలక్ష్మి స్థిరనివాసినియై ఉంటుంది. ఈ కారణంగానే హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావించి శ్రావణమాసం నెలరోజులూ విశేషంగా అర్చిస్తారు. వీటిలో శనివారాలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవని భక్తుల విశ్వాసం. అందుకే కడప జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణమాసంలో వచ్చే నాలుగు శనివారాలూ ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. 

స్థలపురాణం 
త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా గండి ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సోదరులిద్దరినీ సాదరంగా ఆహ్వానించి, ఇక్కడే కొంత కాలం ఉండి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకుంటాడు. ‘రావణ వధ అనంతరం నీ కోరిక తీరుస్తాన’ని రాముడు వాగ్దానం చేస్తాడు. ఇచ్చిన మాట మేరకు రావణ సంహారం అనంతరం పుష్పక విమానంలో సీతారామలక్ష్మణులు వాయుదేవుడి దగ్గరకు బయల్దేరుతారు. ఈ వార్త తెలుసుకున్న వాయుదేవుడు క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తాడు. పాపఘ్ని వేరుచేసే రెండు కొండల కొనలనూ కలుపుతూ బంగారు స్వాగత తోరణాన్ని కట్టిస్తాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సీతారాములు మంత్రముగ్ధులైపోతారు. ఆ సమయంలోనే రామచంద్ర ప్రభువు అక్కడి బండమీద కూర్చొని యుద్ధ సమయంలో తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తన వద్ద ఉన్న బాణంతో ఆంజనేయస్వామి చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే శుభ గడియలు దాటిపోతుండటంతో దాన్ని పూర్తిచేయకుండానే అయోధ్యకు బయల్దేరతాడు. దీనికి ప్రతీకగానే ఇప్పటికీ గండి క్షేత్రంలోని హనుమ చిత్రానికి ఎడమకాలి చిటికెనవేలు ఉండదు. ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది శిల్పులు దీన్ని పూర్తిచేయాలని చూసినా వీలుకాలేదట.మాసమంతా పండగే 

శ్రీరాముడు తిరిగి గండి క్షేత్రానికి చేరుకున్నదీ, హనుమంతుని చిత్రాన్ని రూపొందించిందీ శ్రావణమాసంలోనే. అందుకే ఇక్కడ ఈ నెలంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణంలో వచ్చే నాలుగు శనివారాలు అంజన్నను నాలుగు రకాలుగా అలంకరిస్తారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే వివిధ సేవలు రాత్రి తొమ్మిందింటివరకూ కొనసాగుతాయి. 
చివరి శనివారం వీరాంజనేయస్వామిని ఒంటె వాహనంమీద మాడవీధుల్లో ఊరేగించి, పాపఘ్ని నదీతీరానికి తీసుకువచ్చి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. 

తోరణం కనిపిస్తే... 
వాయుదేవుడు కట్టిన బంగారు మామిడాకుల తోరణం అదృశ్యరూపంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందనీ, భక్తితత్పరులకూ మహనీయులకూ జీవిత చరమాంకంలో ఇది కనిపిస్తుందనీ భక్తుల విశ్వాసం. దీనికి ఉదాహరణగా... 18వ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టరుగా పనిచేసిన సర్‌ థామస్‌ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించినట్లు కడప గెజిట్‌లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని థామస్‌ తన డైరీలో కూడా రాసుకున్నాడని చెబుతారు. 

ఎలా చేరుకోవాలి.. 
కడప జిల్లా చక్రాయపేట మండలంలో గండిక్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం నుంచి పులివెందులకు వెళ్లే బస్సులో వేంపల్లె చేరుకోవచ్చు. అక్కడి నుంచి గండి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ నిత్యం అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి వచ్చేవారు రాయచోటి మీదుగా ప్రయాణించి వీరాంజనేయుడిని దర్శించుకోవచ్చు.
- బాలం గోపాల్‌, న్యూస్‌టుడే వేంపల్లె 
చిత్రాలు: పి.వెంకటరెడ్డి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment