లక్ష్మీ ఆరాధన | Lakshmi Aradhana Sri Mahalakshmi Aaradhana: Sri Mahalakshmi Aaradhana,  Devotional, Bhakti, Pooja, Devotion, Lakshmi, GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu| Information About Goddess Maha Lakshmi Pooja Friday

లక్ష్మీ ఆరాధన 
 Lakshmi Aradhana
Adipudi Sairam
Rs 108/-
...అప్పుడు జగమంతా లక్ష్మీ నివాసం!

పుణ్యాల రాశి... సర్వజగత్తుకూ కల్పవల్లి... దారిద్య్ర వినాశిని... సౌభాగ్యదాయిని...పాలకడలిలో పుట్టిన దీపశిఖ...శ్రీమహాలక్ష్మి... లోకాలన్నిటికీ సర్వ శుభాలనూ చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తానూ ఉంటానని పరమాత్ముడు చెప్పారు. సిరిహరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది. మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి. లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థ్ధానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద. శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసమే.

లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ కోరేవారంతా లక్ష్మీకటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి... వగైరా పేర్లతో వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.

లక్ష్మీ స్తోత్రాల్లో ‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్‌’ అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ, ‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు. రుగ్వేదంలోని ప్రధాన సూక్తాల్లో శ్రీసూక్తం దేవీ తత్త్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా పదిహేను రుక్కుల్లో మనకు వివరించింది. ఇందులో

పుత్రపౌత్ర ధనం ధాన్యం 
హస్త్యశ్వాజావిగోరథమ్‌ 
ప్రజానాం భవసి మాత 
ఆయుష్మంతం కరోతు మామ్‌

పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ... నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ రుక్కు. ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని... అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం... ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు. అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నురాలిని చేసుకోవడమే మన ప్రగతికి శ్రీకారంగా గుర్తించాలి.

ఏమికోరినా అనుగ్రహించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. ‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం...’ జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, వై.శ్రీలక్ష్మీరామకృష్ణ

నాలుగు రకాల పురుషార్థాలను ప్రజలకు అందించేందుకు అమ్మవారు ఫాల్గుణమాసం ఉత్తరానక్షత్రంలో పౌర్ణమివేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణమాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళాలోకంలో శ్రావణశుక్రవారానికి విశేష ప్రాధాన్యం ఉంది.

సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.

గురుభక్తి నిరతులు, సురపితృపూజన 
పరులును, సత్యసంభాషణులును, 
దానశీలురుఁ, బరధనపరదారప 
రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి 
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు 
ర్బలదీన యోషిత్కృపారతులును 
శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు 
నేను మెచ్చు జనంబు; లిట్లుగాక
* ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ 
* ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ 
* ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ 
* ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ 
* ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ 
* ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ
* ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ ఉంటుందో అక్కడ రుంటారో అక్కడ 
* ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ 
* ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని... అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది... 
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ; 
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక 
పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను। 
మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు
* ధర్మాలను పాటించని వారు 
* కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు 
* గర్వం ఉన్నవారు 
* పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు 
* కఠినమైన మాటలాడేవారు 
* క్రూర మనస్తత్వం ఉన్నవారు
----------------

లక్ష్మీదేవి ఆరాధన 
శుక్రవారమే ఎందుకు చేయాలి?
Information About Goddess Maha Lakshmi Pooja Friday

లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈనాడు మానవులే కాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన దినంగా ఎందుకు పేరుమోసింది? రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి.

ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే .... రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది.

లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుండి. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.

------------------  

   సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట . ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.

   మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు. సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే

బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, కార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు
హైందవ సంప్రదాయంలో స్థానం

హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు
ప్రధాన గాధలు

లక్ష్మీ దేవి గురించి వివిధ గాథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.

తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.

విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది.ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీత గా, కృష్ణావతారంలో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.

వివిధ నామాలు
చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
లక్ష్మి రూప చిత్రణ

అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).

అష్ట లక్ష్ములుయజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.
అష్టలక్ష్ములు

లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment