ఆదిత్యారాధన
Adityaaraadhana
Adipudi Sairam
Rs 108/-
ఏలినాటి శని నుంచి
విముక్తి కలిగించే
సూర్యనార్ ఆలయం

ఇష్ట నైవేధ్యంగా చక్కెర పొంగలి
బ్రహ్మ ఆగ్రహానికి గురైన నవగ్రహాధిపతులు
నవగ్రహాల్లో సూర్య భగవానుడిది కీలకస్థానం. యావత్ ప్రపంచానికి ఆయన వెలుగును ప్రసాదిస్తూ.. జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తున్నాడు. నవగ్రహ స్తోత్రంలో ‘ఆదిత్యయాచ’ అంటూ తొలుత సూర్య భగవానుడినే ప్రార్థిస్తాం. అలాంటి సూర్య భగవానుడు ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతమే కుంభకోణం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చు. ఆ దివ్యక్షేత్రమే సూర్యనార్ ఆలయం. ఈ పుణ్యక్షేత్రం చరిత్రపై ప్రత్యేక కథనం..
తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్ని నవగ్రహాల్లో శివుడు ప్రధాన దైవమైతే ఈ ఆలయంలో మాత్రం సూర్యడు ప్రధాన దైవం. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. భక్తులకు ప్రసాదంగా కూడా అదే. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యనార్ దేవాలయం వెలసివుంది.
విజయనగర రాజుల పాత్ర కీలకం
సూర్యనార్ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది.

ఇద్దరు భార్యలతో సూర్యదేవుడు
ఈ ఆలయంలోనే మూలవిరాట్టు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరు సతులైన ఉషా, ప్రత్యూషలతో ఆశీనులై భక్తులకు దర్శనమిస్తుంటాడు. సాధారణంగా సూర్యుడు అంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. ఇక్కడ అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో ఉంటాడు. అంతేకాకుండా సూర్యుడు అంటే వేడి. అందుకే ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఈ వేడిని గమనించవచ్చు.
సూర్యునికి ఎదురుగా శ్వేత అశ్వం
సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాదేవుడుకి ఎదురుగా నంది ఉంటుంది. కానీ, ఇక్కడ సూర్యదేవుడుకి ఎదురుగా అశ్వం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి రథాన్ని లాగేది శ్వేత అశ్వాలే. ఆలయంలో సూర్యుడు పడమర దిక్కును చూస్తూ, రెండు చేతుల్లో కలువ పువ్వులు ధరించి ప్రసన్నవదనంతో భక్తులకు దర్శనమిస్తుంటాడు.
అత్యంత వైభవంగా రథసప్తమి
ఈ ఆలయంలో రథసప్తమి పండుగను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. తమిళ నెల అయిన తాయ్ మాసంలో ఈ వేడుకలు జరుపుతారు. తాయ్ మాసంలో సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపునకు తిరుగుతుందని పురాణాలు చెపుతున్నాయి. భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా. అలాగే, ప్రతి యేడాది తమిళ మాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే మహాభిషేకానికి విశేష సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు.
స్థల పురాణం
కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ కన్నెర్రజేస్తాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారుడైన పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి చేస్తాడు. అంతేకాకుండా, వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు.
ఏలినాటి శని విముక్తి కోసం...
అనేకమంది వివిధ రకాల గ్రహదోషాలతో పాటు ఏలినాటి శనితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కుంభకోణం చుట్టుపక్కల ఉండే నవగ్రహాలను ఒక్కసారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఏలినాటి శని ఇట్టే పోతుందట. అలా స్వాంతన కలిగేలా నవగ్రహాలు మహాదేవుడు వద్ద వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఒక్క సూర్యదేవుని ఆలయంలో మినహా మిగిలిన ఆలయాల్లో ప్రధాన దైవం శివుడు. కానీ, ఈ ఆలయంలో మాత్రం ప్రధానదైవం సూర్యుడు.
సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఆలయానికి సమర్పించుకుంటారు.
ఎలా చేరుకోవాలి?
సూర్యనార్ ఆలయం ఉన్న ప్రాంతానికి సమీపంలోనే కుంభకోణం పట్టణం ఉంది. ఇక్కడ అన్ని రకాల రవాణా వసతులు, బస సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరం. కుంభకోణం లేదా తంజావూరు రైల్వేస్టేషన్ల నుంచి ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. అలాగే ఈ ఆలయానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి విమానాశ్రయం ఉంది.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment