సుబ్రహ్మణ్యారాదన | Subrahmanyaaradhana |
సుబ్రహ్మణ్యారాదన 
Subrahmanyaaradhana
Adipudi Sairam
Rs 108/-
స్కంద పంచమి 

సుబ్రహ్మణ్యారాదన | Subrahmanyaaradhana | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

   స్కందుడు దేవసేనాధిపత్యం పొందిన ఆషాఢ శుద్ధ షష్ఠికి ముందురోజు స్కంద వ్రతాచరణాన్ని శాస్త్రాలు ఉపదేశించాయి. అదే స్కంద పంచమి. మరునాటి షష్ఠిని కుమార షష్ఠిగా వ్యవహరిస్తారు. శివ కుమారుడైన కుమారస్వామికి స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని నామాంతరాలున్నాయి.

కుమారస్వామి గురించి పురాణాల్లో భిన్నగాథలు ఉన్నాయి.

    బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శివపార్వతులు నర్మదాతీరంలో మన్మథక్రీడలో ఉండగా, తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం జరగ్గా, భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదలగా, గంగ రెల్లుపొదల్లో జారవిడిచిందని పురాణాల కథనం. శరవనంలో జన్మించినవాడు శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు మునిపత్నులు ఆ శిశువును బదరికావనం తీసుకుపోయారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.

   బ్రహ్మపురాణంలో సనత్కుమారుడి వృత్తాంతం ఉంది. బ్రహ్మ మానస పుత్రుడు, పరమ వైరాగ్యమూర్తి అయిన సనత్కుమారుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. ఊహాలోకమే వద్దనుకునేవాడికి ఈ కల ఏమిటని సనత్కుమారుడు బ్రహ్మనడిగాడు. అది రాబోయే జన్మలోనిదన్నాడు బ్రహ్మ. ఈ విషయం శివపార్వతులకు తెలిసి సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకు సంతానమైతే బాగుంటుందని అభిప్రాయపడతారు.

    తపో నిమగ్నుడైన సనత్కుమారుడి వద్దకు శివుడు వెళ్లి పలకరిస్తే, అతడు మాట్లాడలేదు. శివుడు ఆగ్రహించి శపించగలనని హెచ్చరిస్తాడు. కళ్లు తెరిచిన సనత్కుమారుడు శాపఫలితం తన దేహానికేగాని ఆత్మకు కాదంటాడు. శపిస్తానన్నా భయపడని సనత్కుమారుణ్ని చూసి ఆశ్చర్యపోయిన శివుడు వరం కోరుకొమ్మన్నాడంటారు. దానికి అతడు- ‘ప్రపంచంమీద ఏ ఆశలేని నాకు వరం దేనికి, కావలిస్తే నీకే ఇస్తాను కోరుకొ’మ్మని చెప్పాడు. ఈ అవకాశం జారవిడుచుకోరాదని శివుడు అతణ్ని తనకు పుత్రుడిగా పుట్టాలని అడుగుతాడు. అడిగింది శివుడు గనుక సనత్కుమారుడు శివుడి గర్భంలో ఒక నిప్పుముద్దగా ప్రవేశించాడు. అది శివుడి మూడోకంటి నుంచి శరవణంలో పడి కుమార రూపం ధరించింది.

కృత్తికాస్త్రీలు తమ స్తన్యంతో పోషించారు.

స్కందుడు శూరపద్మాసురుణ్ని, తారకాసురుణ్ని, అంధకాసురుణ్ని సంహరించాడు.

   సుబ్రహ్మణ్యుడి వాహనం నెమలి. నెమలి నర్తనం ఓంకార రూపం. అతడు ప్రణవ రూపుడు. కోడిపుంజు అతడి ధ్వజం. ‘కో’ ధ్వని జ్ఞానభానూదయానికి సంకేతం. స్కందుడి చేతిలోని ఆయుధం- ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల రూపం. దక్షిణ భారతదేశంలో స్కందపూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సామర్లకోట వద్ద స్కందారామంలోని శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇది పంచారామాల్లో ఒకటి. - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment