అష్టనాగపూజ |  Ashta Naga Puja |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
అష్టనాగపూజ 
 Ashta Naga Puja
M. Satyanarayana Siddanti
online....

నాగులకు పూజలెప్పుడు? 

స్థానిక సంప్రదాయాలు, ఆచారాల్లో ఉండే భేదాల కారణంగా కొందరు శ్రావణంలో, మరికొందరు కార్తీకమాసంలో సర్పారాధన చేస్తారు. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాగా, శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపకుంటారు. కొన్నిచోట్ల శ్రావణ శుద్ధ చతుర్థి రోజున అంటే చవితి నుంచే నాగ పంచమి పూజకు సంబంధించిన విధానం మొదలుపెట్టాలని మరుసటి రోజు వరకు కొనసాగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టే కొన్ని ప్రాంతాల్లో దీన్ని నాగుల చవితి అని కూడా పిలుస్తారు

శ్రావణమాసం శుక్ల పంచమిని నాగపంచమి అంటారు. స్కంద పురాణంలో ఇందుకు సంబంధించిన విషయాలు విస్తారంగా ఉన్నాయి. పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు ఇందులో ఉంది. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆదిశేషుడిని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని కొన్ని చోట్ల ఉంది.- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ

-------------------
నాగపంచమి 


     భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. నాగేంద్రుడు శివుడికి హారమైతే, కేశవుడికి తల్పమయ్యాడు. హైందవ సంప్రదాయాల్లోనేగాక- జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న ప్రతిమలు కొన్నిచోట్ల లభించాయి. సర్పపూజ మొదట అనార్య సంస్కృతి చిహ్నంగా ఉండి, తరవాత వైదికముద్ర పొందినట్లు గోచరిస్తోంది.

     తెలుగునాట నాగారాధన చిరకాలంగా విశేష ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధ వాజ్ఞ్మయంలో నేటి తెలుగు వారి ప్రాంతాన్ని ‘నాగభూమి’గా వ్యవహరించారు. శాతవాహనులనాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుడి పేరులో ‘నాగ’ శబ్దం ఉంది. అమరావతి స్తూపం మీద ‘నాగబు’ పదం ఉంది. నాగశబ్దంతో కూడిన గ్రామ నామాలు, వ్యక్తి నామాలు తెలుగునాట ప్రసిద్ధంగా కనిపిస్తాయి. శ్రావణశుద్ధ పంచమిని నాగపంచమిగా, గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. భవిష్యత్‌ పురాణంలో నాగపంచమి ప్రస్తావన ఉంది.Asta Naga Pooja

     ఉచ్చైశ్రవమనే గుర్రం పాల సముద్ర మథనంలో ఉద్భవించింది. అది తెల్లని వర్ణం గలది. కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్రతీరాన విహరిస్తూ దూరం నుంచి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని చెప్పింది. వినత అంగీకరించక గుర్రం దేహమంతా తెల్లగానే ఉందన్నది. కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే వినతకు దాసి అయ్యేలా పందెం వేసుకున్నారు. మర్నాడు వచ్చి చూద్దామని వెళ్లిపోయారు. కద్రువ కపట బుద్ధితో తన కుమారులైన నాగుల్ని పిలిచి గుర్రం తోకను పట్టుకు వేలాడమని కోరింది. వారు దానికి అంగీకరించలేదు. సర్పయాగంలో నశించాలని వారికి కద్రువ శాపం ఇచ్చింది. కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి ఆమె చెప్పినట్లు చేశాడు. దూరం నుంచి గుర్రం తోక నల్లగా కనిపించడంతో వినత ఓటమిని అంగీకరించి సవతికి దాసి అయింది. వినత కుమారుడైన గరుడుడు తల్లి దాస్య విముక్తికోసం ఇంద్రుణ్ని ఎదిరించి అమృతం తెచ్చి ఇస్తాడు. ఆ తరవాత నాగులపై కోపంతో వారిని భక్షిస్తుంటాడు. పాములు ప్రాణభయం తగ్గించుకోవడం కోసం రోజుకో సర్పాన్ని గరుడుడికి ఆహారంగా పంపడానికి నాగరాజు వాసుకి ఒడంబడిక చేసుకొంటాడు. 
జీమూత వాహనుడనే విద్యాధర యువకుడు పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా సర్పాల మృత అవశేషాలను చూశాడు. ఆ రోజున గరుడుడికి ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వచ్చాడు. అతడి వెంట రోదిస్తూ అతడి తల్లి కూడా వచ్చింది. కరుణాళువైన జీమూత వాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుణ్ని కాపాడదలచాడు. ఎర్రటి వస్త్రాన్ని ధరించి వధ్య శిలపైన ఎక్కగా గరుడుడు అతణ్ని భక్షించసాగాడు. జీమూత వాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని రక్షించమని ప్రార్థించారు. జరిగిన తప్పు గ్రహించిన గరుత్మంతుడు ఇంద్రుణ్ని ప్రార్థించి అమృతంతో జీమూత వాహనుణ్ని రక్షించడమేగాక హతులైన సర్పాలను బతికించాడు. సర్పజాతిని హింసించనని మాట ఇచ్చాడు. ఆ రోజే నాగపంచమి.

చతుర్థినాడు ఉపవసించి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజించాలని శాస్త్ర వచనం. వ్రత చూడామణి గ్రంథం ‘నాగద్రష్ట వ్రతం’ గురించి పేర్కొన్నది.

పంటలను సర్పజాతి వృద్ధి చేస్తుందని, పుత్ర సంతానం ప్రసాదిస్తుందని ప్రజల విశ్వాసం. సర్పాలు భూమిలోని నిధి నిక్షేపాలకు కాపాలాదారులనే భావన ఉంది.
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

----------------------

నాగులచవితి....

మన దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమినాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం. 


    ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములుపెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. 

    వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: